Skip to main content

తమ ఐదు దశాబ్దాల‌ పాలనలో, బీసీల్ని వారి హక్కులకు దూరం చేసి, అణచి వేసిన చరిత్రే తప్ప, అభివృద్ధికి సహకరించిన చరిత్ర కాంగ్రెసుకు ఏనాడైనా ఉందా ? లేదుకదా !

*తమ ఐదు దశాబ్దాల‌ పాలనలో, బీసీల్ని వారి హక్కులకు దూరం చేసి, అణచి వేసిన చరిత్రే తప్ప, అభివృద్ధికి సహకరించిన చరిత్ర కాంగ్రెసుకు ఏనాడైనా ఉందా ? లేదుకదా !

1.    *బీసీలు* అమాయకులు. శతాబ్దాలుగా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్ధికంగా కూడా వెనుకబడిన వారు. అణగ దొక్కబడినవారు. రాజకీయంగా, పూర్తిగా పక్కన బెట్ట బడిన వారు. రాజ్యాంగ గుర్తింపు లేకుండా చేయబడిన వారు. అందుచేత  లోతైన అవగాహన లేని వారు. తమ భాగస్వామ్యం తక్కించు కోవడానికి ఏంచేయాలో ఈనాటి కీ  తెలియని వారు. ఎవరు ఏంచెబితే దాన్ని ఏమాత్రం ప్రశ్నించ కుండా తేలిగ్గా నమ్మేవారు. ఒక విధంగా బీసీలు అల్ప సంతోషులు. బీసీలు మాత్రమే, స్వాతంత్ర్యం అనంతరం, ఏడు దశాబ్దాలుగా దామాషా హక్కులకు దూరం అవుతూ వస్తున్న ఏకైక అధిక సంఖ్యాకులు. ఎస్సీ ఎస్టీలు దామాషా అవకాశాలు పొందు తున్నారు. ఓసీలు దామాషా కు మూడు నాలుగు రెట్లు అవకాశాలు చే జిక్కించు కుంటున్న ఆధిపత్య శక్తులు.‌ అటు ఈ ఆధిపత్య శక్తులకు, ఇటు ఎస్సీ ఎస్టీలకు బీసీలు కరివేపాకులుగా మిగిలి పోతున్న సందర్భాలే చరిత్ర లో కనబడతాయి తప్ప, వారు బీసీలకు ఉపయోగ పడిన సందర్భాలు కనబడవు. 

2.    నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రధానంగా వీరి నాయకత్వాల్లో, కాంగ్రెస్ ఈ దేశాన్ని రమారమి ఐదు దశాబ్దాలు పాలించింది.‌ ఈ ఐదు దశాబ్దాల కాలంలో, బీసీల్ని వారి హక్కులకు దూరం చేసిన చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర. 1872 నుండి 1931 వరకు జరిగిన, కులాల వారి జనాభా లెక్కల సేకరణను, వాటి ప్రయోజనాల గురించి అంత బాగా తెలిసి, ఆ ప్రయోజనాల గురించి, బీజేపీ ప్రభుత్వానికి ఇపుడు పాఠాలు చెబుతున్న కాంగ్రెస్, తమ ఐదు దశాబ్దాల కాలంలో, ఏనాడూ  నాటి "సమగ్ర కులగణన" ను (Caste Census) చేతబట్టి ఎందుకు పూర్తి చేయలేక పోయింది ? బీసీల గణాంకాలు లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది ? ఇపుడు బీజేపీకి నీతులు చెప్పే, నైతికత కాంగ్రెస్ కు ఎలా ఉంటుంది ? అలా అని, "కుల గణన, Caste Census మావిధానం, Policy, కాదని" బరితెగించి సుప్రీం కోర్టులో బీసీల ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ, ఎఫిడవిట్ దాఖలు చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం ఏమాత్రం కాదు. బీసీలను అణగదొక్కడంలో రెండు పార్టీలు, ఒకదానికి మించి మరొకటి పోటీ పడిన చరిత్రే వీరిది.

3.    ఎన్నో దశాబ్దాల ఎగవేత తర్వాత, 2014 లో అధికారం కోల్పోడానికి కొంచెం ముందు, జాతీయ స్థాయిలో బీసీల ఒత్తిడికి తలొగ్గి, పూర్తి స్థాయిలో Caste Census చేయిస్తామని, కాంగ్రెస్ UPA-II ప్రభుత్వం, నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారిచే, జూన్, 2010 లో, లోక్ సభలో వాగ్దాన ప్రకటన చేయించి, దరిమిలా మాటమార్చి పూర్తి Caste Census కాకుండా, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల (BPL Families) కుల వివరాలకు మాత్రమే పరిమితం చేసి, 2011-12 లో సోషియో ఎకనామిక్  కుల గణన, (Socio Economic Caste Census) - (పూర్తి సెన్సస్ కాదు) పూర్తి చేయించారు. 25 కోట్ల కుటుంబాలను ఈ సర్వేలో పరిశీలించి నట్లు అధికారిక సమాచారం ఎక్కడా సమాజం ముందు లేదు. BPL కుటుంబాలు, మొత్తం కుటుంబాల లోని, 10-15 % మించి ఉండవు.  చట్టప్రకారం, రిజిస్ట్రార్ జనరల్, మరియు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా (RGCCI) వారి ఆధ్వర్యంలోనే సెన్సస్ గణాంకాల సేకరణ జరగవలసి ఉండగా, National Rural Employment Guarantee Scheme (NREGS) వారి ద్వారా, ఈ ప్రక్రియ జరిపించి నట్లు, నాడు మీడియా కధనాలు వచ్చాయి. ఆవిధంగా వాగ్దానం చేసిన "సమగ్ర కుల గణనను" పూర్తిగా నీరు గార్చిన ఘనత నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిదే. దానికి సంబంధించిన గణాంకాలు బయట పెట్టాలని, బీజేపీ ప్రభుత్వాన్ని నేడు కాంగ్రెస్ వారు నిలదీయడం, దొంగ, మరో దొంగను నిలదీయడం లాంటిదే. ఇది పూర్తిగా ఎలక్షన్లకు ముందు ఆడుతున్న నాటకమే.  ప్రశ్నార్థక మైన ఈ అసంపూర్తి గణాంకాల వలన నేడు బీసీలకు ఏ విధంగా ప్రయోజనం ? నాడు ఐదు దశాబ్దాలు కాంగ్రెసు నలిపేసిన బీసీల మీద, మనసు మార్చుకుని, నేడు నిజంగా వారి భవిష్యత్తు అభివృద్ధి కి కట్టుబడి ఉంటే, గతంలో బీసీలను అణగ దొక్కి పెట్టిన చారిత్రక వాస్తవాల విషయం బహిరంగ విచారం ప్రకటిస్తేనే, బీసీలకు కొంతైనా వారి మీద విశ్వాసం కలిగే అవకాశం ఉంది. అలా కాకుండా, కంటి తుడుపు, సమయానుకూల ప్రకటనలకే పరిమితం అయిపోతే ఈ రెండు పార్టీలు, బీసీలను పోటీపడి అణగ దొక్కుతూ వచ్చారనే సత్యాన్ని మరచి పోరు. చరిత్ర క్షమించదు.

4.    ఇటువంటి బీసీ వ్యతిరేక చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, నేడు బీజేపీ ప్రభుత్వానికి, కుల గణన చేబట్టాలని కోరుతూ ఉత్తరం రాసి నంత మాత్రాన, మురిసి పోతున్న బీసీలను కాంగ్రెస్ ను భుజానికి ఎత్తేసు కోవడానికి పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్న నాబీసీ సోదరులను చూసి నేను ఎలా అర్థం చేసుకోవాలి ?

                               కొండలరావు
                               18-4-2023

Comments