****************************
హేతువాదానికి ప్రజలు
ఎందుకు దూరంగా ఉంటున్నారు?
*****************************
హేతువాదం అనే మాటను వాడడానికి, వినడానికి, ఆచరించడానికి సమాజంలో చాలామంది వెనుకంజ వేస్తున్నారు. హేతుత్వం, హేతువాదం అంటేనే దూరంగా జరిగిపోతున్నారు. చదువుకున్నవాళ్లు Phd, డాక్టర్, ఇంజనీరింగ్,పోస్ట్ గ్రాడ్యుయేషన్, లాయర్ చేసిన వారు కూడా హేతువాదం అంటే భయపడిపోతున్నారు.
కొందరు పనిగట్టుకుని హేతువాదులు అంటే కులం వద్దంటారని, మతం వద్దంటారని, దైవ భావన కూడదంటారని దుష్ప్రచారం చేస్తున్నారు. అందువల్ల వారు కూడా కనీస ఆలోచన చేయకుండా భయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక కులంలో, మతంలో, దేవుని విషవలయములో చిక్కుకొని ఉన్నారు.
లేనిపోని అభాండాలను కల్పించి ప్రజల్లో హేతువాదుల పట్ల నిరసన భావాన్ని,నిరాసక్త భావనను కలిగిస్తున్నారు. హేతువాదులపై దుష్ప్రచారం గావిస్తున్నారు.
వేషాలు వేసుకుని మోసాలు చేసే వారి పట్ల ప్రజలు, వారెంతో గొప్పవారని వారు దైవంశ సంభూతులని వారు ఎంతో పుణ్యవంతులని వారి కాళ్లపై పడి మొక్కుతూ దక్షిణలు సమర్పించుకుంటున్నారు. అట్టి వేషధారులు, అన్ని మతాల మత బోధకులు, మతస్తులు, కల్లబొల్లి మాటలు, అబద్ధాలు వల్లే వేస్తూ ప్రజలలో విష ప్రచారం చేస్తున్నారు.ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజలు వారి మాయమాటలను నమ్మి నిజమేననుకుని హేతువాదులకు దూరంగా ఉంటున్నారు. హేతువాదులు చెప్పేది సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నారు.
ప్రజలు హేతువాదం అంటే అవగాహన చేసుకోకుండానే వద్దంటున్నారు.
***************************
హేతువాదం అంటే కేవలం ఆలోచన విధానం మాత్రమే. మన జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు, సంఘటనలకు కారణం తెలుసుకొని మతాలైనా, మత గ్రంథాలైనా దేవుడు ఉనికినైనా ప్రశ్నించి, నిజమేదో, అబద్ధమేదో, మంచి ఏదో, చెడు ఏదో, విశ్లేషించి ఆచరించమని హేతువాదం చెబుతుంది. అంతే తప్ప ఇది దేనికి వ్యతిరేకం కాదు. కానీ ప్రజలు హేతువాదం అంటే అవగాహన చేసుకోకుండానే వద్దంటున్నారు
హేతువు అంటే కారణం.
*********************
ఈ విశ్వములో ఏ చిన్న సంఘటన జరిగినా పెద్ద సంఘటన జరిగినా కారణం ఉంటుంది కారణం లేనిది, ఏ చిన్న గడ్డి పోచనయినా కదల్చలేము.
హేతుత్వం అంటే
కార్యకారణ సంబంధం.
*******************
ఏ కార్యము (పని) చేయాలన్నా, చేసినా చివరకు ఆకలైనా, దప్పికైనా కారణం లేనిది మనం ఏ కార్యమూ చేయలేం. ప్రకృతిలో కూడా కారణం లేనిది ఏ కార్యము జరగదు.
ఉదాహరణకు అన్నం తింటాం, కారణం ఆకలవుతుంది కాబట్టి,,,నీళ్లు తాగుతాం కారణం దప్పికవుతుంది కాబట్టి ఇలాగే పెద్దపెద్ద కార్యక్రమాలు కూడా కారణం లేనిది చేయలేం.
ఏ కార్యక్రమాలు చేసినా,కారణం తప్పనిసరిగా ఉంటుంది. పుట్టినా కారణమే ఉంటుంది. చనిపోయినా కారణమే ఉంటుంది.
హేతువాదం మానవుని జీవ లక్షణం.
*******************************
మనిషి పుట్టుకతోనే అతనిలో సహజంగా హేతుత్వం ఉంటుంది.అన్ని భావోద్వేగాల విధంగానే హేతుత్వం కూడా ఉంటుంది.
ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పుట్టుకతోనే హేతుత్వం కలిగి ఉంటాడు. అది జీవ లక్షణం అంటే మనుషులకే కాకుండా ఇతర ప్రాణులలో కూడా హేతుత్వం ఇమిడి ఉంటుంది.
హేతువాదం అంటే
ఒక ఆలోచన విధానం.
*******************
మనిషికి ప్రతి నిమిషం ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఒక పని చేయాలన్నా, ఒక పని చేయవద్దనుకున్నా, ఎటు వెళ్లాలన్నా ఆలోచన చేసి మాత్రమే వెళతాడు. ఆలోచన లేనిది ఎవరు ఏ పని చేయరు. కానీ కొన్నింటిలో మనిషి ఆలోచన చేయ లేకుండా ఇతరులను అనుసరిస్తున్నాడు కాబట్టి హేతువాదం అంటే ఒక ఆలోచన విధానం ఒక సక్రమమైన ఆలోచన విధానం అని మనం అర్థం చేసుకోవాలి
హేతువు అంటే
సత్య జ్ఞానము.
***************
సరియైన జ్ఞానము, సత్యమైన జ్ఞానం అలవడాలంటే, ఆర్జించాలంటే హేతుత్వం ముఖ్యం. ఒక వస్తువు చూసినప్పుడు దానిలోని లోపాలను,దాని యొక్క ఉపయోగాన్ని, అది ఉన్న తీరును తెలుసుకొనుటకు హేతుత్వం ముఖ్యమైన ఆధారం.
హేతుబద్ధ ఆలోచన అంటే
***************""**"*""
హేతువు ఆధారంగా చేసే ఆలోచన. హేతుబద్ధ ఆలోచన అంటే హేతువు (కారణం) ఆధారంగా చేసే ఒక ఆలోచన విధానం
హేతువాదం అంటే
కార్యకారణ సంబంధాన్ని వివరించడం.
*********,*******"***************
ఒక ఒక విషయానికి దాని పరిణామానికి సంబంధించిన కార్యకారణ సంబంధాన్ని వివరించేది హేతువాదమని చెప్పవచ్చు.
సంఘటన జరగడం, జరగడానికి కారణం తప్పనిసరిగా ఉంటుంది అట్టి కారణాన్ని ప్రస్తుత కార్యాన్ని వివరించడమే హేతువాదం ముఖ్య లక్ష్యం
హేతువాదం శాస్త్రీయ విజ్ఞానం.
****************************
ఇది ఒక వైజ్ఞానిక దృక్పథం సైన్సు మూలంగా గల ఒక ఆలోచన దృక్పథం
హేతువాదం మన దినచర్యను కూడా
ప్రభావితం చేసి, మంచి మార్గాన్ని చూపిస్తుంది.
***************************************
ప్రతి దినం వచ్చు మన సమస్యలన్నిటిని సమగ్రంగా పరిశీలించి ఒక అత్యుత్తమమైన మార్గాన్ని చూపించేదే ఈ హేతువాద దృక్పథం. మన దినచర్యను కూడా ప్రభావితం చేసి సక్రమమైన మార్గాన్ని చూపిస్తుంది హేతువాదం.
హేతువాదం సక్రమమైన
జీవన మార్గానికి చెందిన
ఒక ఆలోచనా విధానం.
***********************
మనల్ని చెడు దారి పట్టకుండా, మంచి మార్గం వైపు మళ్ళించి, మన జీవితంలో సుఖసంతోషాలను సౌభాగ్యాన్ని ఆలోచన విధానాన్ని ప్రేరేపించేది హేతువాద దృక్పథం.
హేతువాదం ఒక నిర్ణయాత్మక వైఖరి.
*******************************
మన పుట్టుక నుండి మరణించే వరకు మనం సమాజంలో ఎలా ప్రవర్తించాలో ఇతరులతో ఎలా సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలో సంఘటనల పట్ల ఎలా స్పందించాలో ఒక నిర్ణయాత్మక వైఖరి కలిగిస్తుంది.
కులమత దుష్టభావాలను,
అశాస్త్రీయ వైఖరిని తొలగిస్తుంది.
***************************
మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనలో కలిగించిన మత భావాలను, కుల నియమాలను దైవ భావనను పరిశీలించి మంచి చెడు నిర్ణయించి, మూఢత్వాన్ని, మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని, అశాస్త్రీయ భావాలను పారద్రోలి,
విజ్ఞానాన్ని విస్తరింపజేసే చైతన్యకరదీపిక వలే జ్ఞానమార్గాన్ని నిర్దేశిస్తుంది.
హేతువాదం మంచి చెడుల
నిర్ణయం చేస్తుంది.
*********************
మనిషి సహేతకంగా ఆలోచించి ఏది మంచి? ఏది చెడు? ఏది ఆచరించుటకు వీలైనదో? ఏది కాదో?అని నిర్ణయాత్మకంగా ఫలితాలను రాబట్టి ఆచరించే విధానమే హేతువాదం.
హేతువాదం అశాస్త్రీయమైన
వాటిని నమ్మకూడదు అంటుంది.
***************************
హేతువాదం, అశాస్త్రీయాలను,అభౌతికాన్ని, అతీంద్రియ శక్తులను నమ్మకూడదంటుంది.
మన జ్ఞానేంద్రియాల (కన్ను*ముక్కు*చెవి*నాలుక* చర్మం)కు చిక్కని ఏ పదార్ధమైనా,
ఏ భావాలైనా ఉంటాయన్న మాటలను నమ్మదు.
హేతువాదులు తమ భావాలను
బలవంతంగా ఎవరిపైనా రుద్దరు.
****************************
హేతువాదులు స్వేచ్ఛ
స్వాతంత్ర్యాల ననుభవిస్తారు. కులము, వర్గము, మతము, జ్యోతిష్యము, వాస్తు, స్వర్గ నరకాలు దేవుడు ఇవన్నీ వారి దృష్టిలో అబద్ధాలే. వారు జ్ఞానేంద్రియాలకు చిక్కిన వాటిని, భౌతికమైన వాటినే ఉన్నాయని అంటారు. అబౌతికమేది లేదని వారి భావన. హేతుత్వాన్ని ఆచరిస్తూ జీవితాంతం హేతువాదులుగానే ఉంటారు వారి భావాలను ఇతరులపై రుద్దరు. హేతువాదం చెప్తారు. కానీ బలవంతంగా రుద్దరు. తప్పనిసరి ఆచరించమని చెప్పరు. ఒకరి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను గౌరవిస్తారు.
ఎవరి జీవితంలోనూ,ఎవరి కార్యాచరణలోనూ ఎవరి వ్యక్తిగతంలోనూ జోక్యం చేసుకోరు.
***************************"**"*"***
ఇతరుల వ్యక్తిగత, సామూహిక కార్యక్రమాలలోనూ వారికి ఏమాత్రము ఆటంకం కలిగించరు.హేతువాదులుగా ఉండాల్సిందేనని
ఎవరిని బలవంత పెట్టరు. ఎవరిని ప్రలోభ పెట్టరు. హేతువాదం వలన మీకు లాభాలు కలుగుతాయని పలానా ధనము వస్తుందని, ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని ఏ విధంగానూ ప్రలోభ పెట్టరు.
హేతువాదులు చేసేది
వైజ్ఞానిక ఉచిత సేవ.
*****************
హేతువాదులు వైజ్ఞానిక విషయాలను బోధిస్తూ ఉచిత సేవ చేస్తారు.ఎవరి దగ్గర ప్రతిఫలం ఆశించరు. ప్రతి మనిషి హేతువాది కావాలని ఆశిస్తారు.ప్రతి మనిషి జీవితం బాగుండాలని
కోరుకుంటారు. ప్రతి మనిషి సంఘంలో మంచి పౌరుడుగా తయారు కావాలని కోరుకుంటారు అందుకోసం హేతువాదం యొక్క విశిష్టతను వివరిస్తారు. వారిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరి దగ్గర ఏ విధమైన డబ్బును, ధన, కనక వస్తు వాహనాదులను ఏ విధంగానూ ఆశించరు.
హేతువాదులకు కలిగిన వాస్తవ విజ్ఞానాన్ని, నిజాలను ప్రజలను చైతన్యపరచుటకే వినియోగిస్తారు.
హేతువాదులకు కలిగిన అనుభవాలను, విషయాలను, ప్రకృతికి సంబంధించిన, విశ్వానికి సంబంధించిన వాస్తవ విజ్ఞానాన్ని ప్రజల ముందు ఉంచుతారు. వారి కార్యక్రమాలను ప్రజలను చైతన్య పరచుటకే జీవితాన్ని వినియోగిస్తారు.
హేతువాదం ఏం చేస్తుంది?
********************
హేతువాదం మనిషిలోని అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని, అవాస్తవాలను నిర్మూలించి,
సత్యమైన వైజ్ఞానిక మార్గాన్ని చూపిస్తుంది.
హేతువాదం అన్ని వాదాలకు మూలం.
*******************************
అస్తిక వాదం, నాస్తిక వాదం,భౌతిక వాదం, అబౌతికవాదం, శాస్త్రీయవాదం గతి తార్కిక భౌతిక వాదం లాంటి వాదాలకు హేతు వాదమే మూలమైంది.
హేతువాదం మానవాభివృద్ధికి మూలబీజం.
************************************
హేతువాదం ప్రకృతి రహస్యాలను ఛేదిస్తున్న పదునైన ఆయుధం.
హేతువాదం శాస్త్ర సాంకేతికాభివృద్ధి, తద్వారా మానవాభివృద్ధికి కారణభూతం అయింది.
హేతువాదం మానవవాదానికి పూర్వ రూపం.
************************************"
మానవుడు "మానవ వాది"గా మారుటకు హేతువాదం ఒక మెట్టు లాంటిది మెట్లు ఎక్కి భవనానికి చేరుకుంటాము.అదేవిధంగా మొదట హేతువాదిగా మారిన తర్వాత మనిషి మానవ వాదిగా మారుతాడు. ప్రపంచంలోని మానవులందరూ ఒకటేనని సమానత్వ భావనతో ఉండి,ఉన్నతమైన విలువలను కలిగి ఉంటాడు. హేతువాదం మానవ వాదానికి పూర్వరూపం.
హేతువాదం సర్వమానవ
సమానత్వ భావనకు ప్రతిరూపం.
****************************
కుల, మత, వర్గ, వర్ణ, పేద, ధనిక, లింగ బేధం లేకుండా మనిషి హేతువాదం వలన, సర్వ మానవ సమానత్వ భావనకు చేరుకుంటాడు. అందరిని సమదృష్టితో చూస్తాడు మనిషి యందు దయ జాలి సానుభూతి ఏర్పడతాయి.
హేతువాదం మత జాఢ్యాల
నిర్మూలనకు మెరుగైన సాధనం.
**************************
మతం వల్ల కలిగే నష్టాన్ని దుష్టత్వాన్ని తెలుసుకొని మత నిర్మూలన వైపు మత జాఢ్యాలనిర్మూలన వైపు తన ఉద్యమం కొనసాగిస్తాడు. మతాల దుష్టత్వాన్ని తెలుసుకోవాలంటే లోతుగా అధ్యయనం చేయాలంటే మతాల తత్వాలను తెలుసుకోవాలంటే హేతువాదమే మెరుగైన సాధనం
హేతువాదం మానవ లక్ష్యమైన స్వేచ్ఛ, స్వాతంత్యాలను సాధించడానికి ఏకైక సాధనం.
***************"************************
మానవుని అంతిమ లక్ష్యము స్వేచ్ఛ స్వాతంత్ర్యం. మనిషి ఎల్లప్పుడూ బానిసత్వంలో ఉండడు. ఎప్పుడో ఒకసారి తనకు తన తాను స్వేచ్ఛ
స్వాతంత్యాలను కోరుతాడు. అట్టి స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని పొందడానికి చేరుకోవడానికి హేతువాదమే ముఖ్య సాధనం హేతువాదానికి మించిన సాధనం మరొకటి లేదు.
హేతువాదం మానవ
మేధోవికాసానికి ఆలంబనం.
****"*******************
హేతువాదము మానవాళి మేదో వికాసానికి శాస్త్రీయ దృక్పథానికి మనసును పరిశుద్ధం చేసి మేధస్సును చురుకుగా ఉంచుటకు కొత్త మార్పునకు శ్రీకారం చుట్టి హేతువాదం గణనీయమైన ఫలితాలను సాధిస్తుంది
హేతువాదం దైవభ్రమను తొలగించి,
వాస్తవ విషయాలను బహిర్గతం చేస్తుంది.
************************"*"*********
దేవుడు ఉన్నాడని, దేవుడు మనల్ని పుట్టించాడని, మనల రక్షిస్తాడని, స్వర్గ నరకాలు ఉన్నాయని మనిషి శరీరంలో ఆత్మ ఉంటుందని గతజన్మ పునర్జన్మలు ఉంటాయని ఇలాంటి వన్నీఅబద్ధాలే.
ఇలాంటి అవాస్తవ,అశాస్త్రీయ, ఊహాత్మక, భ్రమలను తొలగించి శాస్త్రీయమైన, వాస్తవ విషయాలను తెలియజేసేది హేతువాదం.
హేతువాదం సమస్యలను
ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని కలిగిస్తుంది.
***********************************
ఏ పని చేయాలన్నా,ఏ విషయాన్ని పరిశీలించాలన్నా మానసిక ధైర్యము, స్తైర్యం కావాలి. హేతువాదం మనిషిలోని విజ్ఞానాన్ని మేల్కొల్పి, పరిశీలన శక్తి కలిగించి విషయాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా, నిర్భయంగా పరిశీలించుటకు కావలసిన మానసిక స్తైర్యాన్ని పెంపొందిస్తుంది.
హేతువాదం మనిషిని
నీతిమంతుడుగా మారుస్తుంది.
**************************
హేతువాదం తన జీవితానికి అన్వయం చేసుకున్న మనిషి నీతివంతుడుగా మారుతాడు.ఇతరులపై అన్యాయంగా దాడి చేయడం ఇతరుల సంపదను కొల్లగొట్టడం ఇతరుల సంపదను దోచుకోవడం న్యాయంగా కొట్టడం తిట్టడం చంపడం లాంటివి చేయకుండా నీతివంతుడుగా మారుతాడు
హేతువాదం జ్ఞానం, సత్యం, సమానత్వం, స్వేచ్ఛ విలువలకు మూలమై మనిషిని మహానుభావుడుగా మహామహుడుగా తీర్చిదిద్దే ఏకైక సాధనం హేతువాదమే.
హేతువాదం బానిసత్వం నుండి విముక్తి కలిగించి, స్వేచ్ఛ సమానత్వ బాట వైపు నడిపిస్తుంది.
************************************
ఒకవేళ మనిషి బానిసత్వంలో ఉంటే హేతువాదం అట్టి మనిషిని బానిసత్వం నుండి విముక్తి కలిగించి స్వేచ్ఛగా మహోన్నత భావనతో మెరుగైన జీవన బాటను చూపిస్తుంది
హేతువాదం ఆలోచనలకు
అడ్డుకట్ట వేయదు.
********************
మనిషికి నిరంతరాయంగా వచ్చి ఆలోచనలను అడ్డుకోదు ఈదువాదం అడ్డుకోదు వాటిని కొనసాగింపు ప్రక్రియలో భాగంగా మెరుగైన ఆలోచనలపై మనిషిని మళ్లిస్తుంది.
నిరంతర అభివృద్ధి కోసం ఆలోచన
కొనసాగిస్తూనే ఉంటుంది.
హేతువాదం ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మానవుడికి అందుబాటులో ఉండే ఏకైక మేధో సాధనం.
*************************************"
హేతువాదం ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని ప్రకృతికి, మనిషి ఉన్న అవినావాభావ సంబంధాన్ని తెలియజేసి వాటిని అర్థం చేసుకోవడానికి, పరిశీలించడానికి, ప్రశ్నించడానికి హేతువాదం ప్రముఖ సాధనంగా పనిచేస్తుంది.
హేతువాదం హేతువు (కారణం)యొక్క
సర్వాధిక్యతను నిర్నిబంధంగా ఆమోదించే మానసికవైఖరి.
మనిషి మెరుగైన జీవితానికి ఆచరించ గలిగిన ఏకైక సాధనం హేతువాదం.మనిషిలోని అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని, అమాయకత్వాన్ని తొలగించి సమాజవాంచిత పౌరుడుగా తయారు చేయుటకు హేతువాదానికి మించిన మరొక సాధనం లేదు........
అడియాల శంకర్. అధ్యక్షులు.
తెలంగాణ హేతువాద సంఘం CellNo.7093062745.
Comments
Post a Comment