ఒక హంతకుడి నిజస్వరూపం
ధీరేంద్ర ఝా కొత్త పుస్తకం
--------------------------
(పుస్తక పరిచయ వీడియోల లింక్స్ పోస్ట్ చివర ఉన్నాయి)
#ధర_రూ300 #కాపీ_కోసం 094900 98654
జగమెరిగిన భారతీయ జర్నలిస్టు ధీరేంద్ర ఝా రాసిన కొత్త పుస్తకం ఇప్పుడు మార్కెట్ లో ఉంది. 'గాంధీజీ హంతకుడు - గాడ్సే జీవితమూ,ఆలోచనలు, అనుబంధాలు' అనే పేరుతో వచ్చిన ఈ పుస్తకాన్ని ప్రచురణ సంస్థ నవతెలంగాణ మనకి కానుకగా ఇచ్చింది. సీనియర్ జర్నలిస్టు ఎస్ వినయ్ కుమార్ దీన్ని తెలుగులోకి అనువదించారు. మహబూబ్ నగర్ కి చెందిన వినయ్ కుమార్ ప్రజాశక్తి దినపత్రికలో కొన్నేళ్ళు ఎడిటర్ గా ఉన్నారు. ఆయన వయసు 70 సంవత్సరాలు.
ధీరేంద్ర ఝా పుస్తకం ఇప్పటికే తమిళ, మలయాళ భాషల్లో వచ్చింది. ఈ పుస్తకం అంతర్జాతీయ ఎడిషన్ కూడా జనవరి 24న మార్కెట్ లో విడుదల అయింది.
హంతకుడు గాడ్సే మనస్తత్వంపై ధీరేంద్ర ఝా చేసిన గొప్ప పరిశోధనా గ్రంథం ఇది. చారిత్రక వాస్తవాలతో, కచ్చితమైన ఆధారాలతో నిజాన్ని నిర్భయంగా చెప్పిన ప్రామాణిక గ్రంధం ఇది.ఈ పుస్తకాన్ని చదవటం నేటి తప్పనిసరి అవసరం అని అనుకుంటున్నాను.
- తాడి ప్రకాష్,సీనియర్ జర్నలిస్టు
*** ***
ఈ పుస్తకంపై కొందరి ప్రముఖుల అభిప్రాయాలు.
''గాంధీజీ హంతకుడు పుస్తకంలో రచయిత ధీరేంద్ర కె. ఝా అపారమైన సమాచారం, సాధికారిక ఆధారాల ద్వారా ఒక ఉన్మాది రాజకీయాలను,ప్రవృత్తిని ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా బట్టబయలు చేశారు. ప్రస్తుత వినాశకర పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి కావలసిన ఆధునిక భారతదేశపు రహస్య దుర్మార్గ చరిత్రను కూడ తేటతెల్లం చేశారు. '
- పంకజ్ మిశ్రా, రచయిత
"ఈ పుస్తకం మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన కుట్రను విపులంగా విశ్లేషించడానికే పరిమితం కాదు, నిజానికి ఇది 1940వ దశకంలో భారత రాజకీయ రంగంపై ఆరెస్సెస్ ఎలా ఆవరించి ఉన్నదో విశదీకరిస్తుంది. ఈ సంస్థ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడకపోయి ఉండవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసి ఉండక పోవచ్చు. సావర్కర్ నాయకత్వలోని మొట్టమొదటి హిందూత్వ పార్టీ హిందూ మహాసభతో సన్నిహితంగా పెనవేసుకుని ఉన్నది. నాధురాం గాడ్సే. సహవ్యవస్థాపకుడుగా ఉన్న హిందూ రాష్ట్ర దళ్ అనే సాయుధ సంస్థతో అవినాభావ సంబంధం కొనసాగించింది. గాడ్సె ఎన్నడూ ఆరెస్సెస్లో సంబంధాన్ని వదులుకోలేదని ఈ పుస్తక రచయిత విజయవంతంగా నిరూపించారు.
- క్రిస్టోఫర్ జఫర్ లాట్
భారత రాజకీయాలపై పలు గ్రంథాలు వెలువరించిన రచయిత
'ఈ పుస్తకం గాంధీజీ హత్యకు కుట్రను,దాని వెనక ఎవరు ఉన్నారు అనే విషయాలను హంతకుడి మానసిక ప్రవృత్తితో సహా సరళమైన రీతిలో, విశ్వసనీయంగా వివరించడం ఒక్కటే కాదు,ఆరెస్సెస్, హిందూ మహాసభ విస్తృత రాజకీయాలను, సావర్కర్ తో సహా దాని నాయకుల గురించి విపులంగా తెలియచేస్తుంది.అందుచేతనే ఇది ప్రస్తుత పరిస్థితిలో అత్యంత ప్రాధాన్యత కలిగి, తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం. '
- మృదులా ముఖర్జీ, చరిత్రకారిణి
*** ***
ప్రచురణకర్తల మాట
------------------------------
గాంధీ హంతకుడు గాడ్సే గురించిన పుస్తకాన్ని నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించడం ఒకింత ఆశ్చర్యం కలిగించ వచ్చు. ఇప్పుడు నాథూరాం గాడ్సే సంఘ పరివార్ శక్తులకు ఆరాధ్య దైవమయ్యాడు. ఆయన విగ్రహాలే కాదు, ఏకంగా ఆలయాలే వెలుస్తున్నాయి. ఆ మాటకొస్తే గాంధీ హత్యకు అసలు సూత్రధారి విడి సావర్కర్ను గాడ్సెను మించి నెత్తికెత్తు కుంటున్నారు. ఆయన చిత్రపటాన్ని ఏకంగా పార్లమెంటు భవనంలోనే ప్రతిష్టించారు.
ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఈ సావర్కర్. స్వాతంత్ర్యోద్యమంలో అండమాన్ జైలు నుండి బయటపడటానికి బ్రిటిష్ వారికి లొంగుబాటు పత్రం రాసి,వారికి అనుకూలంగా పనిచేస్తానని హామీ ఇచ్చి శిక్ష తప్పించుకున్న మహానుభావుడు ఈయన. మొట్టమొదటి హిందూత్వ రాజకీయ పార్టీ హిందూమహాసభకు ప్రత్యక్ష నేతృత్వం వహిస్తూ ఆరెస్సెస్కు మార్గదర్శకుడిగా పనిచేశాడు సావర్కర్.
గాంధీ హత్యకు గాడ్సె తదితరులను పురిగొల్పి తాను మాత్రం భద్రంగా తప్పుకున్నాడు. గాంధీ హత్య కేసులో ముద్దాయిగా విచారణ నెదుర్కొన్న సావర్కర్ గాడ్సెతో కాని,ఆరెస్సెస్తో కాని తన సంబంధాలు దొరక్కుండా జాగ్రత్త పడి శిక్ష నుండి తప్పించు కున్నాడు. ఆరెస్సెస్ కూడ తనకు గాడ్సేకు ఎలాంటి సంబంధం లేదని విచారణ సమయంలో చెప్పింది.
బోనులో నిలబడి విచారణ నెదుర్కొన్న సమయంలో గాడ్సే తనకు విధించిన శిక్షకన్నా తాను ఎంతగానో ఆరాధించిన సంస్థ ఆరెస్సెస్ తనతో ఎలాంటి సంబంధం లేదని చెప్పడం, తాను ప్రత్యక్ష దైవంగా భావించిన సావర్కర్ తనంటే ఎవరో తెలియనట్లు వ్యవహరించడం తనను ఎక్కువగా బాధించిందని చెప్పుకున్నాడు.
అసలు గాడ్సె గాంధీ హంతకుడుగా ఎలా తయారయ్యాడు. ఆయన అలా కావడానికి దారితీసిన పరిస్థితులు,గాడ్సే మానసిక ప్రవృత్తి, కారణభూతమయిన వ్యక్తులు, సంస్థలు ఎవరు అన్న విషయాన్ని ఈ పుస్తకం ఎలాంటి సందేహాలకు తావులేకుండా బట్టబయలు చేస్తుంది.
నేడు సంఘపరివార్ శక్తులు గాంధీజీకి ప్రత్యామ్నాయంగా సైతం ముందుకు తెస్తున్న సావర్కర్ నిజస్వరూపాన్ని, అలాగే సాధికారికంగా వెల్లడించింది.
ఇంతటి విలువైన పుస్తకం కనుకనే నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఈ పుస్తకాన్ని తెలుగులో పాఠకులకు అందిస్తున్నది.
సంఘపరివార్ శక్తులు పేట్రేగిపోతున్న నేటి పరిస్థితుల్లో, వారి తప్పుడు ప్రచారాలను ఎదుర్కొనడానికి ఎంతగానో దోహదపడే ఈ పుస్తకాన్ని ప్రగతిశీల శక్తులు పెద్దఎత్తున వినియోగించు కుంటారని ఆశిస్తూ ఈ ప్రచురణను పాఠకుల ముందుకు తెస్తున్నాము.
• - నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్
ఈ పుస్తకం ఆవిష్కరణ సందర్భంలో పోఫెసర్ వి. తిరుమలి, కె.అనందాచారి, ఎస్.వినయ్ కుమార్ ల ఉపన్యాసాల వీడియోలు కింద మంచి పుస్తకం యూ ట్యూబ్ చానెల్ లింక్స్ లో ఉన్నాయి.
https://youtu.be/BLWxKPhXy7o?si=2u8kc786KUxdbG82
https://youtu.be/BLWxKPhXy7o?si=sF38zboapJxBdZxE
https://youtu.be/HbUADjXwRuw?si=F2ZE1See-wbiE__l
Comments
Post a Comment