లడ్డు కల్తీ జరిగి హిందూ పవిత్రతకే తీవ్రమైన భంగం కలిగిందని దేశానికి ప్రమాదం ముంచుకొచ్చిందని ఆంధ్ర పాలకులు పెడ బొబ్బలు పెట్టినారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగకూడదని , దర్యాప్తు లేకుండా ఆధార రహితంగా రాజకీయ ప్రకటనలు చేయడం తగదని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ మొట్టికాయలు వేసింది. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ ను రద్దు చేసింది. ఇక్కడి వరకు సుప్రీం కోర్టు సందేశం స్పష్టంగానే ఉన్నది. అర్థం చేసుకునే వాళ్లకు చేసుకోగలిగినంతగా ఉన్నది.
కానీ సిబిఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయడం అనంత కాలానికి వాయిదా వేయడమే అవుతుంది.కల్తీ గురించి మత రాజకీయాలు చేసే వారిని ఊరడించడం కోసం కొంత ఉదారత్వం ప్రదర్శించినట్టుగా ప్రజల భావనలు కొనసాగుతున్నాయి.
ఏపీ ప్రభుత్వం కోరికలకు తగిన విధంగా వైసిపి ప్రభుత్వం లడ్డు కల్తీ కి పాల్పడిందనే విషయం ఇప్పట్లో తేల్చడం అసంభవం. కల్తీ లడ్డులో కాదని వాహనాల్లో వచ్చిన ట్యాంకుల్లో మాత్రమే కల్తీ జరిగి ఉంటుందని ల్యాబ్ లో అస్పష్ట రిపోర్ట్ మాత్రమే ఆధారం చేసుకుని జరిగే పరిశోధన ద్వారా ఏమి తేలుతుంది? వచ్చిన అస్పష్ట రిపోర్ట్ ఇప్పటివరకు వెంటనే మరింత స్పష్టము ఎందుకు చేయలేకపోయింది? మరింత తీవ్రమైన పరిశోధనలు చేసినప్పటికీ ట్యాంకులో ఏ డ్రైవరో కల్తీ చేసి ఉంటాడనే రిపోర్టుకు మించి అదనంగా ఏమీ ఉండదు. అంటే తిరుపతి లడ్డూ కల్తీ బహుశా ఎప్పటికీ తేల్చకపోవచ్చు కూడా.
లడ్డు కల్తీ సినిమా ఎపిసోడ్ ముగించబడి పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తానే నాయకుడిగా "సనాతన ధర్మం" పేరిట మరో సినిమా విడుదలైంది . దీని వెనకాల బిజెపి ఇతర హిందూ సంస్థలు ఏ మేరకు ఉన్నారో కానీ టిడిపి పార్టీ మాత్రం మౌనంగానే ఉన్నది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కొనసాగుతూ సనాతన ధర్మం పేరు మీద తీవ్రమైన ఉద్వేగంతో సెక్యులర్ వాదులపై కొనసాగించిన రాజకీయ దాడి కమ్యూనిస్టులకు , మత వ్యతిరేక సంస్థలకు బిజెపి వ్యతిరేక పార్టీలకు తీవ్రమైన సవాలు విసిరినాడు. గతంలో తమిళ నటుడు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం వైరస్ అని పేర్కొన్నాడు. దీని పై బిజెపి ఆర్ఎస్ఎస్ సంస్థలు మత రాజకీయ దాడి కొనసాగించగా ప్రతిగా కమ్యూనిస్టులు లౌకికవాదులు నాస్తిక వాదులు తీవ్రంగానే రాజకీయ ప్రతిదాడిని కొనసాగించినారు. తిరిగి సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేపట్టిన మత రాజకీయం జనసేన పార్టీకి మరింత ఊపు వచ్చి ఆ పార్టీ బలోపేతం అవుతుందా? తద్వారా ఏపీలో బలమైన శక్తిగా మారుతూ ముఖ్యమంత్రి పదవికి బలమైన పోటీదారుగా ముందుకు వస్తాడా? లేదా పవన్ కళ్యాణ్ రంగులు మార్చే కమెడియన్ గా మిగిలిపోతాడా కాలమే తేల్చివేస్తుంది.
అక్టోబర్ 5 2024
జంపన్న
Comments
Post a Comment