మన దేశ ప్రజలలో 90 శాతం మంది అసత్యాలలో మునిగి తేలుతున్నారు. తమ దినచర్యలలో తమ నమ్మకాలలో 90% అబద్ధాలని నిజాలుగా నమ్మి జీవనం సాగిస్తున్నారుఅబద్దాలని ఆచరిస్తున్నారు. " నిజం మాట్లాడితే నిష్టూరం "అన్న విషయాన్ని ప్రజలు నిజం చేస్తున్నారు.
కనపడని విషయాన్ని ఉన్నదని నమ్ముతున్నారు.
ఇందులో చాలా వరకూ తెలిసి చేస్తున్న విషయాలే ఉన్నాయి. అబద్ధమని తెలిసి కూడా అబద్ధాలలోనే బతకటం హాయిగా ఉంటుందని వారి అభిప్రాయం. 90 శాతం మందిలో 50 శాతం పైగా అనుకరణే ప్రధానంగా ఆచరిస్తున్నారు. స్వతంత్రంగా ఆలోచించే వారి సంఖ్య అత్యల్పము.
పుస్తకాలు మనుషులే రాస్తారు. ఆ విషయం ఇంచుమించు అందరికీ తెలుసు. అయితే అన్ని మతాల గ్రంధాలు మనుషులు రాయలేదని, అవి దైవ వాక్యాలని వాటిని ప్రశ్నించడం పాపమని మోసకారులు ప్రచారం చేయడం వలన ఆలోచించలేనీ ప్రజలు అలాగే నమ్ముతున్నారు. మనుషులకు దైవం ఇచ్చినట్లు చక్కని కథలు అల్లా రు.ఇది ఖురాన్ కు, బైబుల్ కు, వేదాలకు ఇలా అనేక మతాలలో పవిత్ర గ్రంథాల పేరుతో అన్వయిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తకాలు అంటే జ్ఞానం ఇచ్చేవి కాకుండా సరస్వతి దేవి స్వరూపమని పిల్లలకు అబద్ధాలు నూరిపోస్తున్నారు.
రాను రాను అబద్ధాలను నిజమని నమ్మి, అదే ఆరాధ్యంగా, పవిత్రంగా చూడటం మొదలు పెట్టారు. ఇవే మన నెత్తిపై కూర్చొని ప్రజల పాలిటి శాపమైనాయి
మనం రాసిన పుస్తకాలు, మనం అచ్చు వేసిన గ్రంథాలనే కళ్ళకు అద్దుకుని, ప్రత్యక్షరం నిజమని నమ్ముతాం, నమ్మిస్తాం. ఇంకా ఘోరం ఎమిటంటే పిల్లలకు ఈ అబద్ధాలను చిన్నప్పటి నుంచి నూరి పోస్తాం. అవి వారికి పెద్దైన తర్వాత కూడా చెరిగిపోవు.
మసీదులు, దేవాలయాలు, చర్చిలు, పగోడాలు మనుషులు కట్టేవే. వాటిలో పెట్టే విగ్రహాలు, రాతలు, చిత్రపటాలు మనుషులు అమర్చేవే. కానీ వాటిని కాలానుగుణంగా వెలసినట్లు, వాటంతట అవే వచ్చినట్లు క్షేత్ర మహిమలు ఉన్నట్లు కల్పనా కథలు అల్లి చెబుతాం.
అదికూడా చెప్పగా చెప్పగా నిజమేమో అనిపించే భ్రమ కల్పిస్తాం. పురోహిత వర్గాలు భక్తుల్ని అలరించటానికి, ఆకట్టుకోవటానికి అనేక క్రతువులు, ఆచారాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు సృష్టించి, నమ్మించి చేయిస్తారు. భక్తులు అదంతా నిజమని నమ్మినా, అందులో నిజం లేదని తెలిసిన వారు ప్రప్రధమంగా పురోహితులే.
కానీ వారి జీవనాధారానికి, మత వ్యాపారానికి అబద్ధాన్ని అలవాటుగా భక్తులకు చెప్పక తప్పదు.
ఈ ప్రక్రియలో భక్తులు దాన ధర్మాలు చేయటం, కర్మ కాండలు చేయటం, నిలువు దోపిడీలు చేయటం, యాత్రలు జరపటం, మొక్కుబడుల పేరిట విపరీతంగా నగ, నట్రా మందిరాలకు, దేవాలయాలకు, మసీదులకు సమర్పించటం నిత్య కృత్యమైపోయింది.
ఆ విధంగా మతాలు, మత బోధకులు, డబ్బు కూడగట్టుకుని, పిల్లలను మతాలకు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతీ మతం కూడా చిన్నప్పటి నుండి పిల్లల్ని మతానికి దగ్గరగా చేర్చి మూఢనమ్మకాలు నూరిపోసి మనసులను కలుషితం చేసి దారుణమైన తప్పులు చేస్తున్నారు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఘోరాతి ఘోరంగా ఉంది.పుట్టిన వెంటనే నవజాత శిశువుకు మతాన్ని, కులాన్ని అంటగట్టి వారి కుల, మతాచారాలను బట్టి పెంచుతుంటారు
కానీ అది తప్పు అని తల్లిదండ్రులు అనుకోవటం లేదు. దానికి నీతి, నియమం అనే ముసుగు కప్పారు. మతం లేకపోతే నీతి ఉండదు. అనే అబద్ధాలను, దైవం పేరిట భయాన్ని విపరీతంగా వ్యాపింపజేశారు. దీనికి గాను సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూ, ఆకర్షణీయంగా కవితలు అల్లుతూ, భాషను కూడా భ్రష్టం చేస్తున్నారు.
చదువుకున్నా అందులో నిష్ఠాతులైనా, చిన్నప్పటి నుండి వచ్చిన మూఢనమ్మకాలను మాత్రం వదిలించుకోలేక పోతున్నారు.
అందుకే హేతుబద్దత , శాస్త్రీయ పద్ధతిని మానవ సంక్షేమానికి వినియోగిస్తూనే మరోపక్కన మూఢనమ్మకాలతో కొందరు సమాజానికి హాని చేస్తూ మానవులను ముందుకు పోకుండా ఎప్పటికప్పుడు అడ్డు పడుతున్నారు.
చివరకు సైన్స్ వల్లనే క్రమేణా విషయాలు తెలుసుకుంటూ అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోగలుగుతున్నాం. వైద్య రంగంలో అభ్యుదయాన్ని సాధిస్తున్నాం. ప్రార్థనలతో రోగాలు నయం కావని, రోగాలు దైవ చర్యలు కావలి మన శారీరక
అసమతుల్యత వల్ల, క్రిముల వల్ల రోగాలు వస్తాయని కనుగొన్నారు వర్షాలు రావడానికి దేవుళ్ళు కారణం కాదని తెలుసుకుంటుంన్నాం.
ప్రకృతి భీభత్సాలకు కారణాలు వేరే ఉన్నాయని గ్రహిస్తున్నాం. కానీ వీటిలో కూడా జ్యోతిష్యులు, దొంగ వ్యాపారానికి వెనుకాడటం లేదు.
మతం మానవాళికి చేసిన, చేస్తున్న ద్రోహం ఇంతా అంతా కాదు. దాని పేరిట జరిగిన హింస అనూహ్యమైనది. మతం వల్లన మానవాళికి ఉపయోగ పడిన అంశం ఒక్కటి లేదు.
కానీ మనుషుల్ని చీలదీసి, కులాలు సృష్టించి అంటరాని తనాన్ని పెంచి పోషించి అమానుషంగా ప్రవర్తించారు. అందుకే అలాంటి దారుణాలను నీతి పేరిట అమలు పరచిన ధర్మశాస్త్రాలను దగ్ధం చేయమని కీ.శే. అంబేద్కర్ నినదించారు.
మానవాళికి భవిష్యత్తు వైజ్ఞానిక దృక్పధంలోనే ఉన్నది. అందులో తప్పులు దిద్దుకుంటూ పోయే లక్షణం ఉండటం గొప్ప విశేషం.
అడియాల శంకర్,
అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం
Comments
Post a Comment