- టి. చిరంజీవులు (ఐఏఎస్, రిటైర్డ్)
భారత దేశంలో నేడు ఆర్థిక అసమానతలు పెచ్చు పెరిగి పోతున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. పేదవారు నిరుపేదలుగా మారుతున్నారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ప్రజాస్వామ్య దేశం నుంచి కొద్దిమంది సంపన్నులు శాసించే (Oligarchy) దేశంగా మారుతుంది. చారిత్రకంగా చూసినట్లయితే గత 3 వేల సంవత్సరాలుగా భారతీయ వర్ణవ్యవస్థ మెజార్టీ శూద్రులకు (నేటి బిసి కులాలు) ఆస్తులు లేకుండా చేసింది. మనుసృ్మతి శోకం! 8.417' విశ్రద్ధం బ్రాహ్మణ: శూద్రద్ (దవ్యోసదనామ చరేత: నహి త్యస్థికించింత స్వం భర్తహర్యదానో హిస: అనగా శూద్రులు ద్రవ్యం కల్గి ఉంటె బ్రాహ్మాణులు నిరభ్యంతరముగ వారి నుంచి తీసుకోవచ్చును శూద్రులకు ఆస్థి ఉంచుకునే హక్కులేదు. ఆధునిక విద్య, రాజ్యాంగ హక్కుల వలన ఎవరైన ఆస్తి సంపాదించే అవకాశం ఏర్పడింది. కాని స్వాతంత్రము వచ్చి 77 సంవత్సరాలయినప్పటికీ నేటికి బిసి, ఎస్సీ, ఎస్టీ లు ఆర్థికంగా ఎదగలేక పోతున్నారు, అణచివేయబడితున్నారు. వేళ్ళూనిన వర్ణ, కుల వ్యవస్థలే దీనికి ప్రధాన కారణం. మార్క్సిజము సిద్ధాంతం ప్రకారం ఆర్థిక వ్యవస్థ అనేది ఒక ఉపనిర్మాణము. దీనిపైనే అన్ని ఉన్నత నిర్మాణాలు నిర్మింప బడతాయి కానీ ఇది భారతీయ సమాజానికి వర్తించదు. ఇక్కడ అంతా కూడా బ్రాహ్మణ, మను వాదముతో ముడిపడిన వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థల పునాదుల పైన ఆధార పడి ఉంది. పుట్టుక తోడనే మనిషి ఆస్తులు, అంతస్తులు, గౌరవం నిర్ణయించ బడుతాయి. ప్రపంచాన్ని డబ్బు శాసించవచ్చేమో గాని ఇక్కడ అంతా వర్ణ, కుల వ్యవస్థలే శాసిస్తాయి. వర్ణ వ్యవస్థలో శూద్రులు అతిశూద్రులు అట్టడుగున ఉంచడము, మను అధర్మ శాస్త్రాలు ఆస్తి హక్కు లేదనడం వలన, శారీరక శ్రమపై ఆధారపడే కులాలుగా, వృత్తులుగా మారిపోయినారు. స్వాతంత్య్ర అనంతరము కూడా మంచి విద్యాభ్యాసం లేకపోవడం, రాష్ట్రంలో 1973 వరకు, కేంద్రంలో 1993 వరకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేకపోవడం, సాంప్రదాయ కులవృత్తులు ధ్వంసం కావడం ప్రభుత్వములు ఆర్థిక అభివృద్ధి పథకాలు కంటితుడుపు చర్యలుగా చేపట్టడం, బ్యాంకు రుణాలు పొందలేక స్వయం ఉపాధి, వ్యాపారాలు, పరిశ్రమలు చేపట్టలేకపోవడము వారిని ఆర్థికంగా అధోపాతాళములోకి నెట్టివేసినాయి. బిసిలలో ఆర్థికంగా బాగుపడిన వారు అతి కొద్దిమంది మాత్రమే.
భారత రాజ్యాంగం ఆర్థికపరమైన అసమానతలు ఉండకూడదని ఉద్దేశ్యంతో సామ్యవాదం (Social) అనే భావనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. అలాగే స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అనేక భూసంస్కరణలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించింది. ప్రైవేటు రంగ సంస్థలైన బ్యాంకులను, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మొదలగు వాటిని జాతీయకరణ చేయడం జరిగింది. కానీ 1991లో ప్రారంభమైన "సరళీకరణ - ప్రైవేటీకరణ - ప్రపంచీకరణ" వలన ప్రభుత్వ రంగసంస్థలు ప్రైవేటీకరణ, విదేశీ నిధుల పెట్టుబడులు, సహజ వనరుల దోపిడీ వలన నేడు భారతదేశంలో ఆర్థిక అసమానతలు విపరీతముగా పెరిగి పోయినవి. నేడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ సుమారు నాలుగు ట్రిలియన్ల కు చేరింది. ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికిని తలసరి ఆదాయంలో 194 దేశాల జాబితాలో ప్రపంచంలో 144 ర్యాంకులో ఉన్నాము. తలసరి ఆదాయం సుమరు 2500 డాలర్లు. (రూ. 220000) మెజారిటీ ఎస్సీ, ఎస్టీ, బిసిలకు 500 డాలర్స్ (రూ.43000) కూడా లేదు. అందుకే దళితులు, ఆదివాసీలు, బిసిల జీవన ప్రమాణాలలో పెద్దగా గుణాత్మక మార్పులు ఏమి జరగలేదు. పట్టణీకరణ వలన వలసలు పెరిగి నిరుద్యోగం, తక్కువ వేతనాలతో చాలీచాలని బ్రతుకులు కొనసాగిస్తున్నారు. కానీ అగ్రవర్ణాల జీవితాలలో విప్లవాత్మక మార్పులు జరిగినాయి. రాజకీయ అధికారంతో ఆర్థిక సంబంధాలు పెనవేసుకొని పోయి తిరుగులేని రాజకీయ ఆర్థిక శక్తిగా వారు ఎదిగినారు. ఏ రంగంలో చూసిన వారిదే ఆధిపత్యం. ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే డిసెంబర్ 24 నాటికి యూనియన్ బ్యాంక్ అఫ్ స్విజ్జర్లాండ్ ప్రకారం 185 మంది బిలియనీర్లు గత 10 సం॥లలో బిలియనీర్లు 123% పెరగగా వారి సంపద 263% పెరిగి 905.8 బిలియన్లకు చేరింది. దీనికి ముఖ్యకారణము గత 10 సం||లుగా అనుసరిస్తున్న ప్రభుత్వ పాలసీలు, ఆశ్రిత పెట్టుబడి దారి విదానము. అమెరికా చైనా తర్వాత డాలర్ బిలియనీర్లలో భారతదేశం మూడవ స్థానం. బిసిలు కేవలం శారీరక శ్రమ పై ఆధారపడి జీతగాళ్లు గా మిగిలారు (గిగ్ వర్కర్స్) హురున్ ఇండియా 2024 రిపోర్టు ప్రకారం 18 మంది బిలియనీర్లతో ముంబై, ఢిల్లీ తరువాత హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. ఈ 18 మంది బిలియనీర్లు కూడా అందరూ అగ్రవర్ణాల వాళ్లే. అగ్రస్థానంలో ఉన్న పదిమందిలో రెడ్లు 7, కమ్మ ఒకటి, రాజు ఒకటి, వెలమ ఒకటి మరియు రూ:1000 కోట్ల నికర ఆస్తులు ఉన్నవారు 104 మంది ఉన్నారు. వాస్తవానికి ఇది ప్రభుత్వ లెక్కల మార్కెట్ విలువ ప్రకారం కాని వాస్తవ మార్కిట్ విలువ సుమారు 10 రేట్ల వరకు ఉంటుంది. అనధికార లెక్కల ప్రకారం రూ:1000 కోట్ల నికర ఆస్తులు దాటిన వారు 5000ల మంది వరకు ఉండవచ్చును. కానీ ఇందులో ఎస్సీ/ఎస్టీ/బిసిలు 10 శాతం మించి ఉండరు. అలాగే ప్రపంచ అసమానత ప్రయోగశాల (world inequality lab) నివేదిక 2024 ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ పాలనలో కూడా లేనంత ఆర్థిక అసమానతలు నేడు పెరిగాయని తేల్చి చెప్పింది. అగ్రవర్ణాల ఒక్క శాతం ప్రజల చేతిలో 40.1% భారతదేశ సంపద కేంద్రీకృతమై ఉంది. 10 శాతం అగ్రవర్ణాల చేతిలో 58% దేశ సంపద ఉండగా మెజారిటీ 50% ప్రజల చేతిలో కేవలం 15% ఉంది. బిలియనీర్లలో 88%అగ్రవర్ణాల వాళ్లే. షెడ్యూల్డ్ కులాలు, తెగల నుంచి ఒక్కరు కూడా లేరు. గత దశాబ్ద కాలంలో ఇది మరీ ఎక్కువగా పెరిగింది. ఇదే విధముగా కొనసాగితే బిసి, ఎస్సీ, ఎస్టీల బ్రతుకులు మరింత దిగజారి ఇది సామాజిక అశాంతికి నాంది పలుకుతుంది అని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్లోని బిలియనీర్ల శాతం దిగజారుతున్న ఒబిసిల శాతం
*పట్టిక* 1
ప్రభుత్వాలు బిసిల సంక్షేమము అభివృద్ధిపై పెడుతున్న ఖర్చులు కేవలం నామ మాత్రం. ఈ క్రింది గణాంకాలు ఈ విషయాలను స్పష్టము చేస్తాయి కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బిసిలపై ఈ క్రింది విధంగా ఖర్చు చేసింది.
ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఫెలోషిప్ మొదలైనవి రూపాయలు కోట్లలో
*పట్టిక* 2
(మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వార్షిక నివేదిక ల ఆధారంగా)
పై పట్టిక ద్వారా స్పష్టమైనదేమిటంటే 60% బిసి జనాభాకు ఇది ప్రభుత్వం విసిరేసిన ఎంగిలి మేతుకులు కూడా కావు
అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా చేసిన కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి (రూపాయలు కోట్లలో)
*పట్టిక* 3
(రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పుస్తకాల ఆధారముగా) ఇవి కేవలం కేటాయింపులు అసలు ఖర్చు చాలా తక్కువగా ఉంది.
పై కేటాయింపులు పై పట్టికలోని ఖర్చు చేసిన నిదులు చూసినట్లయితే జనాభాలో 60 శాతం ఉన్న బిసిలపై ప్రభుత్వాలకు ఎంత ప్రేమో స్పష్టమవుతుంది. అలాగే రాష్ట్రంలో 2017లో అత్యంత వెనుకబడిన కులాల కోసం ఒక కార్పొరేషన్ (ఎంబిసి) ఏర్పాటు చేసింది. గత 8 సంవత్సరాలుగా Rs 3850 కోట్లు పేపర్ మీద మంజూరి చేసి ఖర్చు పెట్టింది కేవలం Rs 19.78 కోట్లు. (పట్టిక 4)ఈ లెక్కన ఖర్చు పెడితే ఇంకో వెయ్యి సంవత్సరాలైనా బిసిలు ఏమాత్రం ఎదగరు. దీనికంతటికి కారణం బిసిలకు చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లేకపోవడం, బిసిల గొంతు ను చట్టసభల్లో గట్టిగా వినిపించే సరైన నాయకత్వం లేకపోవటం.
కాని అగ్రవర్ణాల, ఆధిపత్య కులాల చేతిలోని ప్రభుత్వాలు వారి కొరకు అనేక రకాల ప్రభత్వ పథకాలు తీసుకు వస్తాయి. ఉదాహరణకు కేంద్రం ఎప్రిల్ 14 నుంచి మార్చి 23 వరకు పారిశ్రామిక వేత్తల 14.56 లక్షల కోట్ల రుణాలు మాఫి చేసింది. (ఆర్థిక శాఖ సహాయ మంత్రి భాగవత్ కరద్ పార్లమెంట్లో మే 12, 2024న ఇచ్చిన సమాధానం) అందులో 95% అగ్రవర్ణాల వాళ్లే. రిలయన్స్ కమ్యూనికేషన్కు రూ. 47252 కోట్ల ఋణాలలో 46797 కోట్ల ఋణ మాఫి జరిగింది. చెల్లించిది కేవలం Rs 455 కోట్లు, కాని 80 కోట్ల బిసి పిల్లల చదువుల సాలర్షిప్లపై ఖర్చుపెట్టింది కేవలం 15021 కాని ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చిన్న చిన్న ఋణాలు ఇవ్వడానికి కూడా బ్యాంకరు ముందుకురారు. గమ్మతు ఏమిటంటే బ్యాంకులలోని టాప్ మేనేజ్మెంట్లో 93% అగ్రవర్ణాల వాళ్ళే. అందుకే అగ్రకులాల వారికి ఉదారంగా రుణాలు, కట్టకపోతే ఋణ మాఫిలు. బిసిలకే మొండిచేయి.
గత 10 సంవత్సరాలలో కేంద్రం కార్పొరేట్ రంగానికి ఇచ్చిన అనేక రాయితీల పుణ్యమా అని ఉదాహరణకు సంపద పన్ను విధింపక పోవడం, కార్పొరేట్ టాక్స్ 2019 లో తగ్గించడం వంటి ధనవంతులైన అగ్రవర్ణాలను మరింత ధనవంతులను చేసింది వీరి సంపద విపరీతంగా పెరిగిపోయింది. అలాగే రెవిన్యూ రాబడిలో ప్రత్యక్ష పన్నుల శాతం పెరిగి పరోక్ష పన్నుల శాతం తగ్గింది అంటే సామాన్య టాక్స్ చెల్లింపుదారుని మీద భారం వేయడమే.
మనరాష్ట్రానికి వస్తే అగ్రకులాలు రాజ్యాధికారాన్ని అడ్డము పెట్టుకొని పరిశ్రమల, ప్రజా సేవ పేరున కారు చౌకగా విలువైన ప్రభుత్వ భూములు తమ కులాల వారికే కేటాయించు కుంటున్నారు.కార్పోరేట్ ఆసుపత్రి అయిన ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్కు కేవలం రూ.8500/లకు ఎకరం చొప్పున 30 ఎకరాలు 1982లో ల్యాండ్ సీలింగ్ చట్టాలను ప్రక్కన పెట్టి కేటాయించారు. ఏనాడు పేదలకు ఈ అసుపత్రీ ఉచిత వైద్య సేవలు అందించిన పాపాన పోలేదు. అలాగే సినిమా పరిశ్రమ వాళ్లకు, ఫిల్మ్ స్టూడియోలకు, ఆసుపత్రులకు, అనేక పరిశ్రమలకు, ఎన్జీఓ లకు కూడా కేటాయించారు. వారు నేడు ఆ భూములు అమ్ముకుని వందల కోట్లు సంపాదించు కొంటున్నారు. వారికి కేటాయించిన భూముల విలువ నేడు లక్ష కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. ఇక భారి కాంట్రాక్ట్లు అన్ని వారికే. ఇష్టమైన రీతిలో ప్రాజెక్ట్ అంచనాలు పెంచడం, వాటి నుండి లాభాలు గడించడం, ఆ తరువాత ఆ లాభాలతో హైదరాబాద్ చుట్టూ భూములు కొనడం తర్వాత ప్రభుత్వ భూముల వేలములో ధరలు పెంచడం, తద్వారా తమ భూముల విలువలు పెంచుకోవడం, కోటీశ్వరులుగా మారడం ఇది వారి వరుస. ప్రభత్వాలు కూడా తమ కులం వారికి మొదటే ప్రాజెక్ట్ వస్తున్నదని సమాచార మిచ్చి (insider information) తక్కువ ధర కు భూములు కొనేలాగ చూడటం. ఆ తర్వాత ప్రాజెక్ట్ ల పుణ్యమా అని వాటికి విపరీతముగా ధరలు రావడం మనం చూస్తూనే ఉన్నాము. ఉదాహరణకు సైబరాబాద్ పుణ్యమా అని కమ్మ కులస్తులు, ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పుణ్యమా అని రెడ్డిలు, రీజినల్ రింగ్ రోడ్, యాదాద్రి ప్రాజెక్ట్ ద్వారా వెలమలు విపరీతం గా లాభ పడ్డారు. అలాగే సహజ వనరుల దోపిడి గనులు, ఇసుక, కలప. మొ॥నని వ్యాపారానికి వస్తే కార్పొరేట్ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, సినిమా రంగము, రియల్ ఎస్టేట్లు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలు అన్ని వారియే. ఫార్మా పరిశ్రమలు కూడా నానినే అందు వల్లే ఈ రోజు హైదరాబాద్లో అగ్రవర్ణ ధనవంతుల సంఖ్య దేశంలో ఎక్కడ లేనంత పెరిగి మూడవ స్థానానికి చేరుకుంది. హైదరాబాద్ లో బిసి వర్గాలు కనీసము సింగల్ బెడ్ రూమ్ కొనే పరిస్థితి లేకుండా పోయింది. అగ్ర వర్ణాల ధనాశకు, ప్రభుత్వ భూముల దోపిడి కి అంతం లేకుండా పోయింది. ఆ సొమ్మును ఎలక్షన్స్లలో విపరీతంగా ఖర్చు పెట్టడం, అధికారం సంపాదించడం, ఆ తర్వాత తిరిగి అనేక రేట్లు సంపాదించడం పరిపాటు అయింది. బడ్జెట్ బిసి లకు ఖర్చు చేసింది తక్కువ కాని అగ్రవర్ణాలు బడ్జెటేతర పద్దతులో రూల్స్ను తుంగలో త్రొక్కి సంపాదించింది ఎక్కువ.రాజ్యాధికారం కు కుల పక్ష పాతం కలిస్తే ఏర్పడే దుష్పరిణామాలు ఇవి.
ఆ నాడు వర్ణ వ్యవస్థను అడ్డం పెట్టుకొని శూద్రులను, అతి శూద్రులను అణగత్రొక్కారు. ఈ నాడు అధికారబలము +కులం అండ తో అణగతొక్కుతున్నారు. ఇక వీరికి ఈ దేశములో విముక్తి లేదా?
బిసి ప్రజల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ నామ మాత్రమే. ఉదాహరణకు 2021 -22 కేంద్ర బడ్జెట్లో షెడ్యూల్ కులాల కాంపోనెంట్ రూపాయలను 1,26, 259 కోట్లు అలాగే షెడ్యూలు తెగల కాంపోనెంట్ రూపాయలు 76, 256 కోట్లు కానీ 60 శాతం జనాభా ఉన్న ఒబిసిలకు అలాంటి కాంపౌండెంట్ ఏమీ లేదు. బడ్జెట్ కేటాయింపు 2000 కోట్లు రూపాయలు మాత్రమే. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా, ఈరోజు దేశంలో 80 కోట్ల బిసిలలో సుమారు 25 కోట్ల బిసిలు అమానవీయ దుర్భర పరిస్థితులలో జీవిస్తున్నారు.
ఇప్పటికే బిసిలు రేషన్ కార్డులు, పెన్షన్లు మొ|| వాటి పై ఆధార పడి జీవించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇకనైన బిసిలు తమకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకొని రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత కొరకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనది. రాజ్యాధికారం ద్వారానే తమ సకల సమస్యలకు పరిష్కారము, తమకు ఈ దోపిడీ నుంచి విముక్తి అనే విషయాలను అర్థం చేసుకొని తమ ఓటు తమ బిసి పార్టీ లేదా బిసి అభ్యర్థులకే వేసుకోవాలి. బిసి రాజ్యాధికారం తెచ్చు కోవాలి, లేనిచో ఈ ఎంగిలి మెతుకుల బ్రతకులే మిగులుతాయి. 2047 బిసి నాయకత్వన్ని బల పరుచుకోవాలి నాటికి వికసిత్ భారత్ అనేది మెజారిటీ ప్రజలైన బిసి ఎస్సీ ఎస్టీలకు కేవలం ఒక కలలాగే మిగిలిపోతుంది.
Comments
Post a Comment